జిల్లాలో 48 బ్లాక్ స్పాట్లు–60 రోజుల్లో సవరణ చర్యలు-కలెక్టర్ వెంకటేశ్వర్
సగటున ప్రతి సంవత్సరం 550 ప్రాణాలు..
తిరుపతి: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమంగా ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.మంగళవారం ఉదయం శిల్పారామం నందు రోడ్డు భద్రత – బస్సుయాత్ర పై జిల్లా ఎస్పీ, ఆర్ అండ్ బి, రవాణా శాఖ, నేషనల్ హైవే సంబంధిత కలిసి విలేకరుల సమావేశంలో నిర్వహించారు.
తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో:- ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ముందున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లాలో సగటున ప్రతి సంవత్సరం 550 నుంచి 560 మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, తిరుమల దర్శనానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రాక, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, ఓవర్ స్పీడింగ్, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం లోపం, సిగ్నల్ జంపింగ్, లేన్ క్రాసింగ్ వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని అన్నారు.
మొత్తం 48 బ్లాక్ స్పాట్లు:- గత సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాణాంతక లేదా తీవ్ర ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదాలకు దారితీసే స్ట్రక్చరల్ లోపాలు, రహదారి సమస్యలు, స్థానిక పరిస్థితులు విశ్లేషించి, స్థానిక ప్రజలు, వ్యాపారులు, నివాసితుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక-శాశ్వత చర్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు తెలిపారు.
రాత్రి వేళల్లో అనధికారిక ప్రదేశాల్లో భారీ వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, ట్రక్కులను నిర్దేశిత ట్రక్ బే లైన్లలో మాత్రమే నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ… తిరుపతి జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచించిన 50 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తాత్కాలిక పరిష్కారాలను వెంటనే అమలు చేసి, శాశ్వత పరిష్కారాల కోసం జాతీయ రహదారి సంస్థలతో చర్చలు జరిపి అండర్‌పాసులు, బ్లింకర్లు వంటి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

