భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి
అమరావతి: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. సోషల్ మీడియాలో పోస్టులో ప్రధాని మోదీ, ముఖర్జీని గురించి ప్రస్తవిస్తూ దూరదృష్టి కలిగిన దేశ నిర్మాతగా-“ధైర్యసాహసాలకు శాశ్వత నిదర్శనం”గా కొనియాడారు. అలాగే, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఏలను 2019లో తమ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆయన త్యాగానికి అత్యంత సముచితమైన నివాళి అని నొక్కిచెప్పారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
శ్యామా ప్రసాద్ సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, దేశసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని చెప్పారు. వలస పాలన, విభజన రాజకీయాలు, సామాజిక సవాళ్ల వంటి అంశాలపై ఆయన రాజీపడకుండా పోరాడారని గుర్తు చేశారు. దేశ సమైక్యతే శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజాజీవితానికి మూల సూత్రమని ప్రధాని తెలిపారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే కొనసాగడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అనంతరం జమ్మూ కశ్మీర్ సంపూర్ణ విలీనానికి కృషి చేస్తూ నిర్బంధంలోనే ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.హోం మంత్రి అమిత్ షా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఘన నివాళులర్పించారు.

