అయోధ్య రామ్ లల్లా ఆలయంలో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పవిత్రమైన అయోధ్య ధామంలోని శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీ మాతా అమృతానందమయి,ఇతర ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి ఆ దివ్య ఆలయంలో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఆమె రామ్ లల్లా ఆలయంలో దర్శనం, హారతి ఇచ్చి, అందరి సుఖసంతోషాల కోసం శ్రీ రామ్ లల్లాను ప్రార్థించారు. ఆలయ నిర్మాణంలో పనిచేసిన సుమారు ఆరువేల మంది కార్మికులను, అంగడి వ్యాపారులను, కళాకారులను ఈ కార్యక్రమానికి రామజన్మభూమి ఆలయ ట్రస్టు ఆహ్వానించింది. శ్రీరామ యంత్రాన్ని రాష్ట్రపతి ప్రతిష్ఠించి, హారతి ఇచ్చారు. అనంతరం టెంపుల్ కాంప్లెక్స్ లోని ఏడు ఆలయాలను రాష్ట్రపతి దర్శించారు. ఈ రోజుతో రామ్‌లల్లా నిర్మాణం పూర్తి కావడం విశేషమని, యావద్దేశ ప్రజలే కాకుండా విదేశీయులు సైతం ఇక నుంచి పూర్తి ఆలయాన్ని దర్శించుకోవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు.

