వన్యప్రాణి సంరక్షణలో కార్పోరేట్లు భాగస్వాములు కావాలి-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: పర్యావరణ సమతుల్యత, స్థిరత్వానికి వన్యప్రాణి సంరక్షణ చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు వన్యప్రాణి సంరక్షణలో భాగం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యవరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తన తల్లి శ్రీమతి అంజనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఏడాదిపాటు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును భరించనున్నట్టు ప్రకటించారు. గురువారం విశాఖ జూ పార్కును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. జూ పార్క్ లో జంతువుల సంరక్షణ నిమిత్తం ప్రస్తుతం ఏర్పాటు చేసిన సౌకర్యాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూపార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అటవీశాఖ అధికారులతో చర్చించారు.
జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లు:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ అంశంలో జూపార్కులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అంతరించిపోతున్న జీవ జాతులను రక్షిస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ జూపార్క్ లో వందలాది వన్యప్రాణులు, పక్షులు ఆహ్లాదకర వాతావరణం మధ్య జీవిస్తున్నాయి. వాటిని సంరక్షణ మనందరి బాధ్యత. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లు భాగస్వాములు కావాలి. తమకు నచ్చిన జంతువును ఎంచుకొని వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు.
ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ప్రారంభోత్సవం:- జూలో నూతనంగా ఎలుగుబంట్ల కోసం ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జూలో ఉన్న రెండు నల్ల ఎలుగుబంట్ల వివరాలు తెలుసుకుని, వాటికి ఆహారం అందించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో కెనోపీ వాక్:- జూ పార్క్ సందర్శన అనంతరం కంబాలకొండ ఎకో పార్క్ ని పరిశీలించారు. ఎకో పార్క్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన నగరవనాన్ని ప్రారంభించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ నగరవనాన్ని అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, ఏపీసీసీఎఫ్ శాంతిప్రియా పాండే, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ రీజనల్ మేనేజర్ శ్రీమతి జ్యోతి, విశాఖ డీఎఫ్ఓ రవీంద్ర దామ, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.

