మైపాడు గేట్ వద్ద వైభవంగా మల్లికార్జున స్వామి తెప్పోత్సవం
అత్యాధునిక పార్కు అభివృద్ధి చేస్తాం: మంత్రి ..
నెల్లూరు: నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. సర్వాలంకార భూషితులైన స్వామి, అమ్మవార్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారు కాలువలో జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 2014లో తాను మంత్రిగా, అబ్దుల్ అజీజ్ మేయర్‌గా ఉన్న సమయంలోనే స్థానికుల కోరిక మేరకు ఈ ఘాట్‌ను అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు…భక్తుల సౌకర్యార్థం కాలువకు ఇరువైపులా అత్యాధునిక సౌకర్యాలతో పార్కును అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు…దేవాదాయ, మున్సిపల్ మరియు పోలీసు శాఖల సమన్వయంతో ఉత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

