రహదారుల నాణ్యతలో రాజీపడేది లేదు-నేను స్వయంగా పరిశీస్తా-ఉపముఖ్యమంత్రి
అమరావతి: రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ.2 వేల కోట్లు నిధులు సమకూర్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.ఈ నిధులను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు.ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో బాగా దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి సాస్కి నిధులు సమకూరాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వీటిని సద్వియోగం చేసుకుందామన్నారు. సాస్కి నిధుల వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రహదారుల నాణ్యతలో రాజీపడేది లేదు:- పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి తీసుకువచ్చిన నిధులని,,వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుపైనా, అధికార యంత్రాంగంపైనా ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నామన్నారు. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దు. రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
నేను, నిపుణులు క్షేత్ర స్థాయిలో:- కాంట్రాక్టు పొందినవారికీ ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయలని,,సదరు ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం అవసరం అన్నారు. నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలని,,అలాగే నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్ళి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు.. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్ట చేశారు.
ప్రతి గ్రామానికీ మంచి రహదారులు ఉండాలి:- ప్రజలకు పటిష్టమైన రోడ్లు అందించడం అవసరం వుందని,, మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు. రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పూర్తి అలక్ష్యంతో వ్యవహరించిందని,, వివిధ మార్గాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని విస్మరించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తోందని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు.

