తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్య-మంగళవారం దేవస్థానం ఘాట్ రోడ్డు మూసివేత
అక్టోబర్ 27న భారీ వర్షాల సూచనతో దేవస్థానం నిర్ణయం..
ఘాట్ రోడ్డుపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత..
భక్తుల రాకపోకలకు మహామండపం మార్గం మాత్రమే..
అమరావతి: ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా రేపు అనగా మంగళవారం నగర పరిసరాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది.
ఘాట్ రోడ్డు వైపు అనుమతి లేదు:- వర్షాల సమయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా మంగళవారం ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు దేవస్థాన కార్య నిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వైపు అనుమతి లేదని, అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల రాకపోకలకు మహామంటపం మార్గాన్ని మాత్రమే వినియోగించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సేవలందిస్తారని, భక్తులందరూ ఈ మార్పును గమనించి ఆలయ భద్రతా సిబ్బందికి, అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

