సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
సూర్యమండల మధ్యవర్తిగా భక్తులకు..
ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించే సూర్యప్రభ వాహనసేవ..
తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో సూర్యమండల మధ్యవర్తిగా వెలుగొందుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
సూర్యప్రభ వాహనం – సకల జీవకోటికి చైతన్యప్రదాత
సూర్యభగవానుడు సకల జీవరాశులకు చైతన్యాన్ని, ప్రకృతికి వెలుగును, జీవకోటికి శక్తిని ప్రసాదించే ఆరోగ్యప్రదాతగా పూజలందుకుంటున్నాడు. సూర్యతేజంతోనే చంద్రుడు సైతం ప్రకాశిస్తున్నాడని పురాణాలు పేర్కొంటాయి. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారి విహారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

