AP&TGCRIMENATIONAL

“ఆపరేషన్ ఫైర్‌వాల్ “18 మంది ఏర్పడిన గూఢచారి ముఠాను అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్

పాకిస్థాన్ కు సున్నితమైన సమాచారాన్ని..

10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు..

అమరావతి: పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో(ISI) సంబంధాలు నెరుపుతూ దేశ రక్షణ కేంద్రాలు, వ్యూహాత్మక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న ఆరోపణలపై, 13 మంది నేవీ సిబ్బందితో సహా మొత్తం 18 మందితో ఏర్పడిన గూఢచారి ముఠాను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (AP CI) విభాగం పట్టుకుంది.

12 ప్రత్యేక బృందాలు రంగంలోకి:- పాకిస్తాన్ స్పై నెట్‌వర్క్ గుట్టును ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు “ఆపరేషన్ ఫైర్‌వాల్ “ పేరుతో చేధించారు. దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ, నేవీ సమాచారాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ గూఢచర్యంపై 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక సహా ఏకంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 18 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో 13 మంది నేవీ సిబ్బంది ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.

ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా రహస్య సమాచారం చేరవేత:– రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ఛానళ్ల ద్వారా పాకిస్తానీ ఏజెంట్లకు చేరవేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సోదాల్లో భాగంగా అనుమానితుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, హార్డ్ డిస్క్‌ లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. మొత్తం 18 మంది నెట్‌వర్క్‌ లో ఇద్దరి పాత్రపై పక్కా ఆధారాలు లభించడంతో వారిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

రిమాండ్‌కు కాంట్రాక్ట్ డ్రైవర్:- అరెస్టయిన వారిలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయివరప్రసాద్ ముఖ్యమైన పాత్ర పోషించినట్లు గుర్తించారు. న్యాయస్థానం అతనికి ఈ నెల 14వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అధికారులు విశాఖపట్నం జిల్లా జైలుకు తరలించారు. ఈ గూఢచర్యం నెట్‌వర్క్‌ లో ఇంకా ఎంతమందికి భాగస్వామ్యం ఉందనే కోణంలో అధికారులు లోతైన దర్యప్తు చేస్తున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *