5,499 హెక్టార్ల విస్తీర్ణంలో 55 లక్షల తాటి గింజలు నాటడం లక్ష్యం
తాటి వనం… తీరానికి రక్షణ కవచం..
తుపాను గాలి నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు.
తాటి గింజల సేకరణ, నాటే ప్రక్రియ ప్రారంభం..
13 లక్షల తాటి గింజలు సేకరించిన అటవీ శాఖ..
తాటి వనాల ఏర్పాటు ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు
అమరావతి: సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న గ్రేట్ గ్రీన్ వాల్ సంకల్పంలో కీలకమైన తాటి వనాల ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యింది. తాటి కాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజల సేకరణ, నాటే కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రకృతి విపత్తుల సమయంలో గాలి నిరోధక వ్యవస్థగా తాటి వనాలు తీర ప్రాంత గ్రామాలకు తీవ్ర గాలుల నుంచి రక్షణ కల్పించనున్నాయి. మూడంచెల గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటు ప్రక్రియలో తాటి వనాల ఏర్పాటుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
తీర ప్రాంతాల్లో కోత నిరోధక వ్యవస్థగా:- తాటి చెట్టు ఎత్తుగా పెరిగే జాతి కావడంతో బలమైన సముద్ర గాలులకు సహజ నిరోధక వ్యవస్థగా పని చేస్తుంది. అంతే కాదు బలమైన తాటి వేర్లు నేలను గట్టిగా పట్టి ఉండడం వల్ల తీర ప్రాంతాల్లో కోత నిరోధక వ్యవస్థగా కూడా ఉంటుంది. పక్షులు, కొన్ని రకాల సరిసృపాలకు ఆవాసంగా ఉండే తాటి చెట్లు జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉంటాయి.
5,499 హెక్టార్ల పరిధిలో తాటి వనాలు:- వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తట్టుకోగల శక్తి తాటి చెట్టు సొంతం. అందుకే పవన్ కళ్యాణ్ రూపొందించిన మూడంచెల గ్రేట్ గ్రీన్ వాల్ ప్రణాళికల్లో మొదటి అంచె మడ అడవులకు, రెండో అంచె తాటి వనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5,499 హెక్టార్ల పరిధిలో తాటి వనాల ఏర్పాటును లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అందుకు
ఇప్పటికే 1 లక్ష 65 వేల తాటి గింజలను:- వివిధ వ్యవస్థల భాగస్వామ్యంతో 13 లక్షల తాటి గింజలు సేకరించారు. ఇప్పటికే 1 లక్ష 65 వేల తాటి గింజలను పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు, స్కూలు విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో నాటే ప్రక్రియను రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఈ సీజన్‌లో పవన్ కళ్యాణ్ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
అటవీ శాఖకు ప్రజలంతా సహకరించాలి:- తాటి గింజల సేకరణ, నాటడం, తాటి మొక్కల పెంపకం వంటి అంశాల్లో రాష్ట్ర అటవీ శాఖకు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మొలకెత్తే తాటి మొక్కల స్వీయ సంరక్షణ చర్యలు చేపట్టాలని, మొలకెత్తిన మొక్కల పైకి పశువులను తోలడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సహజ సంపదను కాపాడుకునే చర్యల్లో అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందికి సహకరించాలని కోరారు.

