AP&TG

డిసెంబర్‌ చివరికి క్వాంటం కంప్యూటింగ్‌ భవనం పూర్తి-మంత్రి నారాయణ

భూమి నుంచి వచ్చే సీస్మిక్‌ శబ్దాలు..

క్వాంటం వ్యాలీలో రెండు భారీ టవర్లు..

జనవరిలో క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు..

అమ‌రావ‌తి: అమరావతి రాజధానిని నాలెడ్జ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసిన తరహాలో అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

భూమి నుంచి వచ్చే సీస్మిక్‌ శబ్దాలు:- క్వాంటం వ్యాలీ మిషన్‌లో భాగంగా సుమారు 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటం కంప్యూటింగ్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్వాంటం ల్యాబ్‌ కోసం ప్రత్యేకమైన నిర్మాణ సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. ‘రూమ్‌ వితిన్‌ రూమ్‌’ కాన్సెప్ట్‌తో ల్యాబ్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. భూమి నుంచి వచ్చే సీస్మిక్‌ వైబ్రేషన్స్‌, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ తదితర శబ్దాలు క్వాంటం కంప్యూటింగ్‌ పరికరాల పనితీరుపై ప్రభావం చూపకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జర్మన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి:- డిసెంబర్‌ చివరి నాటికి భవనాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, క్వాంటం కంప్యూటింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం జనవరిలో క్వాంటం కంప్యూటింగ్‌ సేవలను ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

క్వాంటం వ్యాలీలో రెండు భారీ టవర్లు:- క్వాంటం కంప్యూటింగ్‌ భవనం పక్కనే రెండు భారీ టవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని మంత్రి తెలిపారు. ఒక్కో టవర్‌ 48 అంతస్తులతో,202 మీటర్ల ఎత్తు ఉండేలా డిజైన్‌ చేసినట్లు చెప్పారు. రెండు టవర్లకు కలిపి సుమారు 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానుందని తెలిపారు.జనవరిలో క్వాంటం కంప్యూటింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *