AP&TG

గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

ఆధునిక సాంకేతికతతో మన్యంలో అటవీ ఏనుగుల సమస్యకు..

రైతుల పంటలు, ప్రజల ప్రాణాల రక్షణకు కీలక..

ప్రజల భద్రత, వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యం..

అమరావతి: ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అదే దృక్పథంతో మానవ, ఏనుగు సంఘర్షణలను తగ్గించడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన  కుంకీ ఏనుగుల శిబిరాన్నిపవన్ కళ్యాణ్ బుధవారం వర్చువల్ గా ప్రారంభించారు. అడవి ఏనుగుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను రక్షించడం, దశాబ్దాల నుంచి ఉన్న మానవ–ఏనుగు సంఘర్షణను నివారించడమే  లక్ష్యంగా ఈ శిబిరం పని చేయనుంది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించడం, రైతుల పంటలను ధ్వంసం చేయడం, ప్రజలు రాత్రివేళ భయాందోళనల మధ్య జీవించడం వంటి సమస్యలు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా కొనసాగుతున్నాయి.

క్లిష్టమైన ఆపరేషన్లలో కుంకీ ఏనుగులు:- గతంలో పలమనేరు ప్రాంతంలో చేపట్టిన క్లిష్టమైన ఆపరేషన్లలో కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యుతో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థంగా పని చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా మానవ–ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలను 70 శాతానికి పైగా తగ్గించడంతోపాటు, పంట నష్టాలను కూడా గణనీయంగా తగ్గించగలిగారు. అదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. మనుషులు, ఏనుగులు మధ్య సామరస్య సహజీవనానికి వేదికగా ఈ గుచ్చిమి ఏనుగుల క్యాంప్ నిలవాలనే ఆశతో దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నాను అని అన్నారు. 

కర్ణాటక ప్రజలు, ప్రభుత్వానికి:-  పార్వతీపురం జిల్లాలో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం కర్ణాటక ప్రభుత్వం, అక్కడి ప్రజలు అందించిన సహకారం. మన విజ్ఞప్తిని గౌరవించి, ఎంతో ఆప్యాయతతో నాలుగు కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించడం వారి గొప్ప మనసుకు, స్నేహభావానికి నిదర్శనం. ఏనుగులను ఇవ్వడం అనేది సంపద ఇచ్చినట్లు అక్కడ ప్రజలు భావిస్తారు. అయినా తెలుగు ప్రజల రక్షణ కోసం ప్రేమతో కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించిన కర్ణాటక ప్రభుత్వం, ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *