తీర ప్రాంత అడవుల రక్షణ,ఆక్రమణల నిరోధంపై దృష్టి-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రొద్దుటూరు గ్రామీణ రోడ్లకు రూ.10 కోట్లు..
అమరావతి: తీర ప్రాంత అడవుల రక్షణ.. ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనవరి నెలాఖరులోపు అందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడం, అటవీ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలకు అప్పగించాలని తెలిపారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపడం తన లక్ష్యాల్లో ఒకటని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. అనుబంధంగా ఉండే అన్ని ప్రభుత్వ శాఖలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మంగళవారం వెలగపూడి, సచివాలయం 2వ బ్లాక్ లోని క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ “భారత దేశంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సుమారు 974 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతాన్ని విపత్తుల నుంచి రక్షించడంతోపాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. తీర ప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పు పచ్చదనంతో నింపేయాలి. ఆ పరిధిలో మడ, సరుగుడు, తాటిచెట్లు లాంటి మొక్కలతో నింపేసి తుపానులు లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంతానికి, తీర ప్రాంతం వెంబడి ఉన్న ఆవాసాలకు రక్షణ కల్పించాలన్నారు.
500 మీటర్ల వెడల్పున:- ఇప్పటికే మన కోస్తా తీరం వెంబడి 402 కిలోమీటర్ల పరిధిలో 500 మీటర్ల వెడల్పున అటవీ శాఖ మొక్కలు నాటి, వాటి సంరక్షణ చర్యలు చేపడుతోంది. మిగిలిన భూముల్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్న భూ విస్తీర్ణం ఎంత? అందులో అటవీ శాఖ పరిధిలో ఎంత ఉంది? ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతులో ఉన్న భూమి ఎంత? అన్న అంశాలపై అధ్యయనం జరిపాలి.
మూడు దశల్లో గ్రేట్ గ్రీన్ వాల్:- గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును మూడు దశల్లో ముందుకు తీసుకువెళ్లాలి. మొదటి దశలో కోస్తా ప్రాంతానికి ఆనుకుని ఉండే ప్రాంతం మొత్తం మొక్కలు పెంచాలి. మలి దశలో తీర ప్రాంతానికి ఆనుకుని ఉండే కాలువలు, రోడ్లు, డొంకల వెంబడి మొక్కలు నాటాలి. చివరి దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు కూడా ఉపయోగపడే విధంగా మొక్కలు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలి.
ప్రొద్దుటూరు గ్రామీణ రోడ్లకు రూ.10 కోట్లు:- ఉప ముఖ్యమంత్రిని, ప్రొద్దుటూరు శాసన సభ్యులు వరదరాజుల రెడ్డి కలిశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. పంట పొలాల మధ్య రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో పండ్ల తోటలు అధికంగా ఉన్న నేపథ్యంలో రోడ్డు సౌకర్యం కల్పిస్తే మార్కెటింగ్ సదుపాయాలు మెరుగవుతాయని, ప్రొద్దుటూరు హార్టికల్చర్ హబ్ గా ఎదుగుతుందని వివరించారు. సాస్కీ పథకం కింద ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 10 కోట్లు కేటాయించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.ప్రాధాన్యత క్రమంలో మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

