డిసెంబర్ 1వ తేదీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
అమరావతి: డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 19 రోజులు పాటు కొనసాగుతాయి. ఈ తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ శనివారం అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశాలకు ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి తెలిపారు. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగే నిర్మాణాత్మక, అర్థవంతమైన సమావేశాల కోసం తాను ఎదురుచూస్తున్నానని మంత్రి వెల్లడించారు.ఈ శీతాకాల సమావేశాలు 18వ లోక్‌సభకు మరింత కీలకమని, ప్రజా సమస్యలు, దేశ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగి, కొత్త చట్టాలు రూపొందే అవకాశం ఉందని రిజిజూ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సఫలం కావాలని, ప్రజలకు మేలు చేకూర్చాలని ఆశిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

