NATIONAL

అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పూర్తిగా బయటకు తరిమేస్తాం-హోం మంత్రి అమిత్ షా

అమరావతి: దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తరిమి వేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం అస్సాంలోని కామ్‌రూప్‌లో పోలీస్‌ 10వ బెటాలియన్‌ కొత్త క్యాంపస్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో షా మాట్లాడుతూ నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో అక్రమ చొరబాటుదారులను కూడా ఏరివేయడం  జరుగుతుందన్నారు. అక్రమ చొరబాటుదారులను వారు ఆక్రమించిన స్థలాల నుంచి తరిమికొట్టినంత మాత్రాన సమస్య తీరిపోదని, వారు మరో చోట స్థిరపడే అవకాశం ఉందని హోం మంత్రి అన్నారు. అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పూర్తిగా బయటకు తరిమేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.

అక్రమ చొరబాటుదారులే కాంగ్రెస్ పార్టీకి:- అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అస్సాం ప్రజలకు మాట ఇచ్చారని,అయితే ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదని వెల్లడించారు. అక్రమ చొరబాటుదారులే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ కాబట్టి వారిని రక్షించాలనేదే హస్తం పార్టీ విధానమని విమర్శించారు. అక్రమ చొరబాటుదారుల విషయంలో కాంగ్రెస్ విధానాలే అస్సాం రాష్ట్రంకు ప్రమాదంగా మారాయని హోం మంత్రి ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి నిబద్ధత ఉంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయాన్ని పొందుపర్చాలని సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే 5 సంవత్సరాల్లో ఈశాన్య ప్రాంతానికి ఐకాన్ గా అస్సాం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చెందుతుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *