అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో క్యాంటమ్,డేటా సెంటర్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న కృత్రిమ మేథస్సు ద్వారా పోటీతత్వం అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంలో చంద్రబాబు మాట్లాడుతూ సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుందని తెలిపారు. గూగుల్ లాంటి సంస్థల రాకతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఏఐ డేటా హబ్‌గా మారుతుందని వెల్లడించారు. ఈ రంగాల్లో పెద్దఎత్తున ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించటంతో పాటు క్వాంటం హాబ్ గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతున్నామన్నారు.డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు MoUలు కుదుర్చుకున్నారు.

