రైలు ప్రయాణ ఛార్జీలు స్వల్పంగా పెంపు-జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి
అమరావతి: భారతీయ రైల్వే ప్రయాణ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు, తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కూడా భారతీయ రైల్వే కీలక మార్పులు చేసింది..ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి కానుంది.
స్వల్పంగా పెరగనున్నప్రయాణ ఛార్జీలు:- నాన్-ఏసీ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణ ఛార్జీ కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెరగనుంది. ఏసీ తరగతుల్లో ప్రయాణానికి కిలోమీటర్‌కు రెండు పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. సబర్బన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే, 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సెకండ్ క్లాస్ టికెట్ల ధరల్లో కూడా ఎటువంటి పెంపు ఉండదు. 500 కిలోమీటర్లకు మించిన దూరాలకు మాత్రం సెకండ్ క్లాస్ ప్రయాణంలో కిలోమీటర్‌కు అర పైసా చొప్పున ఛార్జీ పెరగనుంది. నెలవారీ సీజన్ టికెట్ల (ఎంఎస్‌టీ) ధరల్లో కూడా ఎటువంటి పెంపు లేదని రైల్వే శాఖ తెలిపింది.
తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి:- తత్కాల్ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆధార్ ప్రామాణీకరణను భారతీయ రైల్వే తప్పనిసరి చేసింది. ఈ నిబంధన కూడా జూలై 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. “తత్కాల్ పథకం ప్రయోజనాలు సాధారణ ప్రయాణికులకు అందేలా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ 10, 2025న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం, ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.
OTP విధానం, ఏజెంట్లపై ఆంక్షలు:- జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులు ఆధార్ ఆధారిత OTP ద్వారా అదనపు ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, భారతీయ రైల్వే అధీకృత బుకింగ్ ఏజెంట్లపై కూడా తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొన్ని పరిమితులు విధించారు. ఏసీ క్లాస్ బుకింగ్‌ల కోసం ఉదయం 10:00 నుంచి 10:30 గంటల వరకు, నాన్-ఏసీ క్లాస్ బుకింగ్‌ల కోసం ఉదయం 11:00 నుంచి 11:30 గంటల వరకు మొదటి రోజు తత్కాల్ టికెట్లను బుక్ చేయకుండా ఏజెంట్లను నిరోధించారు. ఈ మార్పుల వివరాలను అన్ని జోనల్ రైల్వే విభాగాలకు తెలియజేయాలని కూడా సూచించింది. తత్కాల్ రిజర్వేషన్ ప్రక్రియను ప్రయాణికులకు మరింత క్రమబద్ధీకరించడమే ఈ చర్యల లక్ష్యమని రైల్వే వర్గాలు తెలిపాయి.