ముగబోయిన అద్భుత స్వరం-ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి
అమరావతి: భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో ఒక అద్భుత స్వరశకం ముగబోయింది. దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ గ్రహీత ఆశా భోంస్లే (92) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శనివారం గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తొలుత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వచ్చినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే మరణవార్తను అధికారికంగా ధృవీకరించారు. ఎనిమిది దశాబ్దాల పాటు 20కి పైగా భాషల్లో వేల పాటలతో కోట్లాది మందిని అలరించిన ఆమె మరణంతో బాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, భారతరత్న లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోంస్లే అంతిమ సంస్కారాలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్‌లో పూర్తి ప్రభుత్వ అధికారాలతో నిర్వహించనున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, సంగీత ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

