షిప్ బిల్డింగ్ దేశాలలో 2030 నాటికి భారతదేశం టాప్-10లో ఒకటి-కేంద్ర మంత్రి సోనోవాల్
దుగ్గిరాజపట్నం వద్ద నౌకా నిర్మాణ కేంద్రం..
అమరావతి: ప్రపంచంలోని షిప్ బిల్డింగ్ దేశాలలో 2030 నాటికి భారతదేశం టాప్-10లో ఒకటిగా నిలుస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ మంత్రి, సర్బానంద సోనోవాల్ తెలిపారు. సోమవారం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCI) యాజమాన్యం కిందకు వచ్చిన VLGC(శివాలిక్) నౌక తొలిసారిగా విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. శివాలిక్ నౌకకు సర్బానంద సోనోవాల్ విశాఖ సముద్రంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
2047 నాటికి టాప్-5 దేశాలలో భారత్:- భారత సముద్ర రవాణా వాణిజ్య రంగంలో శివాలిక్ కీలకపాత్ర పోషించనుందని,,ఇందుకు ఉదహరణ నేడు ఈ నౌక తన తొలి ప్రయాణంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(LPG)ను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. 2047 నాటికి టాప్-5 దేశాలలో భారత్ ఒకటిగా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. దేశంలో మెరిటైం అభివృద్ధికి ప్రతి ఏటా రూ.6 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా 112 నౌకల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భారత సముద్ర రవాణా రంగంలో ఇదొక మైలురాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాజపట్నం వద్ద నౌకా నిర్మాణ కేంద్రానికి డీపీఆర్ పూర్తయిందని తెలిపారు. దుగ్గరాజుపట్నం వద్ద నౌక నిర్మాణ కేంద్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. భారతదేశ విదేశీ వాణిజ్యంలో 70 శాతం సముద్ర మార్గాల ద్వారా రవాణా జరుగుతుందన్నారు.