క్యాష్-ఆన్-డెలివరీపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు
అమరావతి: క్యాష్-ఆన్-డెలివరీ (CoD) ఆర్డర్‌లపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతూ, తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా కొనుగోలు చేసే వస్తువులకు ఆన్‌లైన్ పేమెంట్‌తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉంటూంది. అయితే, కొన్ని సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వస్తూన్న ఫిర్యాదులపై కేంద్రం ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్ని రకాల ఫీజులు వసూలు చేస్తారు:- క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలుపై ఓ యూజర్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘వర్షాల సమయంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు జెప్టో, స్విగ్గీ, జొమాటో విధించే ఫీజులను పక్కనబెట్టండి. ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు, పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు, ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు పేరుతో ఏవేవో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలా నాకు రూ. 226 వసూలు చేశారు. ఇకపై యాప్ స్క్రోల్ చేస్తున్నందుకు కూడా ఫీజులేస్తారేమో..?’ అంటూ సదరు యూజర్ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.
దోపిడీ చేసే చీకటి విధానమే:- క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉపయోగించుకున్నప్పుడు కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ‘ఇలా చేయడం యూజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. దోపిడీ చేసే చీకటి విధానమే. దీనిపై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించాం. అలాంటి ప్లాట్‌ఫామ్‌లను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, న్యాయమైన విధానాలను కొనసాగించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు.