ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం
సీడబ్ల్యూసీ ఛైర్మన్ నేతృత్వంలో..
అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఓ ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫై చేసింది.
కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) ఛైర్మన్లు, జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్ ఇంజినీర్‌తో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
గతేడాది జులైలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని చర్చించారు. ఇటీవల డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రతినిధులను నామినేట్ చేయడంతో కమిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.
ఇరు రాష్ట్రాల మధ్య నీటిని సమానంగా పంచడం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలు వంటి కీలక అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఇదే సమయంలో, కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) గడువును కూడా కేంద్రం 2026 జులై వరకు పొడిగించింది.

