శబరిమల ఆలయంకు సంబంధించి 4.54 కిలోల బంగారం మాయం
అమరావతి: ప్రసిద్ధ శబరిమల ఆలయం నుంచి బంగారం కనిపించకుండా పోవడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ద్వారపాలక (సంరక్షక దేవత) విగ్రహాలను కప్పి ఉంచిన బంగారు పూతతో కూడిన రాగి పలకలను 2019 లో తొలగించి తిరిగి పూత పూసినట్లు సమాచారం..వాటిని తిరిగి అమర్చినప్పుడు, వాటి బరువు 4.5 కిలోలు తక్కువగా ఉంది.
కేరళ హైకోర్టు ఆగ్రహం:- వాటి బరువు 42.8 కిలోలు కాగా మరమ్మతుల కోసం చెన్నైకి చెందిన సంస్థకు అప్పగించేసరికి వాటి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. దాదాపు 4.54 కిలోల మేర వ్యత్యాసం వచ్చింది. ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసం అని పేర్కొంది. దీనిపై లోతైన విచారణ అవసరమని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
తాపడంలో లోపాలు తలెత్తడంతో:- వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు.అయితే కేవలం 6 సంవత్సరాలకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. 2019లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరమ్మతులు చర్యలు చేపట్టింది.బోర్డు సభ్యులు స్పెషల్ కమిషనర్‌కు కానీ, కోర్టుకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ బంగారు రేకులను తొలగించడం వివాదానికి కారణమైంది.