మొంథా తుఫాన్ తీవ్రతను తట్టుకునేందుకు వివిధ బృందాలు సిద్ధం-కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘ మొంథా ‘ తుఫాను నేపథ్యంలో,తుఫాన్ పరిస్థితులన తట్టుకునేందుకు పూర్తి స్థాయి ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు మొంథా తుఫాన్ ను తట్టుకునేందుకు తీసుకున్న ముందస్తు చర్యలపై ఆదివారం కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 9 తీర మండలాలు ఉండగా, వీటిలో 42 సెన్సిటివ్ గ్రామాలు, 166 హాబిటేషన్లు గుర్తించామన్నారు. తుఫాన్ ప్రభావం సమయంలో ప్రజలకు సురక్షిత ఆశ్రయం కల్పించేందుకు 144 రిలీఫ్ సెంటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు..అవసరమైతే ఈ రిలీఫ్ కేంద్రాలను ఉపయోగించుకుంటామని తెలిపారు.
విజయ డెయిరీ ద్వారా పాలు:- జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 27 ప్రదేశాలు, రైల్వే మార్గాల్లో 16 ప్రదేశాలు వరదలకు లోనయ్యే అవకాశం ఉందని గుర్తించినట్లు చెప్పారు. 377 చౌక దుకాణాలతో రిలీఫ్ సెంటర్లను అనుసంధానించి, అవసరమైన పిడిఎస్ బియ్యం సరఫరా దాదాపు పూర్తయిందని తెలిపారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు 82 డీసెంట్రలైజ్డ్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని, విజయ డెయిరీ ద్వారా పాలు సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.
800 ఆర్వో ప్లాంట్లు సిద్ధం:- తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా డీటీఆర్లు, కండక్టర్స్ లను డీసెంట్రలైజ్డ్ విధానంలో సిద్ధంగా ఉంచగా, 35 సీపీడబ్లుఎస్ పథకాలకి బ్యాకప్ పవర్ ఏర్పాటు చేసినట్లు, 823 ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో క్లోరినేషన్ పూర్తి చేశామని తెలిపారు. తాగునీటి సరఫరాకై 800 ఆర్వో ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని, అలాగ్ 40 వేల నీటి క్యాన్లు సేకరించి అందుబాటులో ఉంచామన్నారు.
BSNL, Jio, Airtel సంస్థలతో సమావేశం నిర్వహించి, 2100 మొబైల్ టవర్స్‌కు పవర్ బ్యాకప్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. నెల్లూరులో ఒక NDRF బృందం, కావలిలో SDRF బృందాన్ని సిద్ధంగా ఉంచామని, అవసరమైతే వారి సేవలను వినియోంచుకుంటామని కలెక్టర్ తెలిపారు.

