మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు- చిన్న జీయర్ స్వామి
సుందరీకరణ పేరుతో ఆలయాల ప్రాచీనత దెబ్బతినకూడదు….
నెల్లూరు: మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు.. పురాతన ఆలయాల ప్రాచీన చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చిన్న జీయర్ స్వామి అనుగ్రహభాషణం చేశారు.
బుధవారం ఉదయం నెల్లూరు మూలాపేటలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం శ్రీ చిన్నజీయరు స్వామి వారి స్వహస్తములతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత హోమశాలలో ప్రత్యేక పూజల అనంతరం వేణుగోపాలస్వామి, ఉప ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తజనాన్ని ఉద్దేశించి చిన్నజీయరు స్వామి అనుగ్రహభాషణం చేశారు.
తెలుగుజాతి చరిత్ర చాలా గొప్పది:- భారతదేశం మొత్తం మీద తెలుగువారికి ఉన్న చరిత్ర మరెవ్వరికీ లేదని చిన్నజీయరు స్వామి అన్నారు. ఆహారంలోనూ..విహారంలోనూ..వ్యవహారంలోనూ తెలుగువాడి చరిత్ర గొప్పదన్నారు. తమిళనాడులోని శ్రీరంగం, మధురై పురాతన ఆలయాల్లో ఇప్పటికీ మన తెలుగులిపి కనిపిస్తుందన్నారు. మన చరిత్రను మనం సంరక్షించుకోవాలన్నారు. తెలుగువారి చరిత్రకు ఆలయాలే మూలాధామన్నారు. ఆలయాల సుందరీకరణ తప్పు కాదని, అయితే ఆలయాల ప్రాచీనత దెబ్బతినకూడదన్నారు. ఆలయాల చరిత్ర కనుమరుగు కాకుండా ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. పురాతన శిలాశాసనాలు, శిలాఫలకాలు, వస్తుసామగ్రిని అలాగే ఉంచి మన చరిత్రకు సాక్ష్యాలుగా రేపటి తరాలకు అందించాలన్నారు.పూర్వీకులు మనకు అందించిన వేల సంవత్సరాల చరిత్ర పరంపరను కొనసాగిస్తూ ఆలయాలకు వైభవం తీసుకురావాలని సూచించారు.
18నెలల్లోనే ఆలయ నిర్మాణం:- రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 27వేల ఆలయాల బాధ్యతను సీఎం చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో అప్పగించారని, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం గల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గతంలో వందలాది కల్యాణాలు జరిగేవని, భక్తులతో ఆలయం కళకళలాడేదని మంత్రి గుర్తుచేశారు. అయితే కాలక్రమంగా ఆలయ శక్తి తగ్గడంతో చిన్నజీయరు స్వామి వారి సూచనల మేరకు ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం 17 కోట్ల నిధులను మంజూరుచేసినట్లు చెప్పారు. ఆలయ పవిత్రత దెబ్బతినకుండా ఖర్చుకు వెనకాడకుండా ఆలయ గర్భాలయం, అంతరాలయం, రాజగోపురం, అన్వేటి మండపం నిర్మాణాలను రాతి కట్టడాలతోనే నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ట్రస్ట్ సభ్యుడుగా:- ఐదుగురు సభ్యులతో ట్రస్టుబోర్డు ఉండాల్సి ఉండగా, ఒక స్థానంగా ఖాళీగా ఉండడంతో ఆనం వివేకానందరెడ్డి పెద్దకుమారుడు ఆనం చెంచుసుబ్బారెడ్డి ట్రస్ట్ సభ్యుడుగా నేడు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు, ప్రముఖులు, భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

