రోడ్లపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోండి-కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్లను ఆక్రమిస్తూ చేపట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తొలగించి వేస్తామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు.పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక పొదలకూరు రోడ్డు, 28వ డివిజన్, 29వ డివిజన్ గాంధీనగర్ పార్కు ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. రోడ్లను ఆక్రమిస్తున్న మెట్లు, ర్యాంపులు ఇతర నిర్మాణాలను సచివాలయాల పరిధిలో గుర్తించి, తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ తెలిపారు. అనుమతుల మేరకు మాత్రమే భవన నిర్మాణాలను చేపట్టాలని, అనధికార, అక్రమ కట్టడాలను తొలగించేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

