10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0- కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్న వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి ఈ మీటింగ్ ను నిర్వహించామని, రెండోసారి ఈనెల 10న జిల్లావ్యాప్తంగా 3600 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు 143 కళాశాలలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మీటింగ్ రోజున విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, విద్యార్థుల బోధన సామర్ధ్యాలను వారికి ఉపాధ్యాయులు తెలియజేస్తారన్నారు. విద్యార్థుల ప్రతిభను తెలిపే ప్రోగ్రెస్ కార్డులను కూడా అందిస్తారని చెప్పారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారు, పాఠశాలలో క్రమశిక్షణతో ఉంటున్నారా, ఏయే సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారు మొదలైన అంశాలను తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని సోషల్ ఫారెస్ట్ ద్వారా నిర్వహిస్తామన్నారు. స్కూల్ ప్రాంగణంలో గానీ లేదా అణువైన ప్రాంతాల్లో చెట్లు నటించి రెండు సంవత్సరాలు పాటు వాటిపై శ్రద్ధ వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్థులు మన విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసిస్తున్నారని, వారి ప్రతిభ పాటవాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.