AP&TGDISTRICTSEDU&JOBSOTHERS

నెల్లూరు సిటీ తరహాలో రూరల్ లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి- మంత్రి నారాయణ

రూ.5 కోట్లతో జిల్లా పరిషత్..

నెల్లూరు: నెల్లూరు సిటీ తరహాలో రూరల్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంపై  ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. రూరల్ పరిధిలోని పొదలకూరు రోడ్డు Z.P బాలికల హైస్కూల్‌ను రూ.5 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను మంత్రి పరిశీలించి, అక్కడి మౌలిక వసతులు, తరగతి గదుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు వీఆర్సీ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే రూరల్ ప్రాంతాల్లో కూడా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జడ్పీ బాలికల పాఠశాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులతో  ముందుకొచ్చిన ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ యాజమాన్యాన్ని అభినందించారు. ఏప్రిల్ 15 తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు త్వరలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నారాయణ విద్యాసంస్థల ద్వారా సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్:- అనంతరం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న సి.సి  రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేసి పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు  సూచించారు.పనుల్లో వేగం పెంచి  వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీ రావు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక నేతలు, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *