ముందస్తు జాగ్రత్త చర్యలతోనే “మొంథా” తుఫాను నష్టనివారణ సాధ్యం-ప్రత్యేకాధికారి యువరాజ్
నెల్లూరు: ముందస్తు నివారణ చర్యలతోనే మొంథా తుఫాను నష్టాన్ని నివారించగలమని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తుఫాను జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ అధికారులకు సూచించారు.
ప్రత్యేకాధికారి యువరాజ్:- సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి తుపాన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన అప్రమత్తత చర్యలపై జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాన్ ప్రభావం ఎలాగైనా వుండోచ్చని, ముందస్తు జాగ్రత్త చర్యలతోనే నష్టనివారణ సాధ్యమన్నారు. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ శాఖల అధికారులు, సిబ్బందిగా చాలా అప్రమత్తంగా వుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ జిల్లాలో తుపాను నుంచి ప్రజలను రక్షించేందుకు NDRF,SDRF బృందాలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రజలకు సహాయం అందించేందుకు 24 గంటలు పనిచేసేలా కంట్రోలు రూంను కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 0861`2331261, 7995576699 నెంబర్లలో ప్రజలు సహాయం కోసం ఫోన్ చేయాలని సూచించారు. పెన్నానది పరివాహక సమీప ప్రాంతాల్లో వరదలు ప్రభావం చూపే 40 సున్నిత ప్రదేశాలను గుర్తించి తాత్కాలిక మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ విజయ్‌కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

