ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి ఈనెల 16వ తేదీ నుంచి 45 రోజులు మూసివేత-కమిషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్, నెల్లూరు ట్రాఫిక్ విభాగం సిఐ రామకృష్ణలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం మాట్లాడారు. ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి మరమ్మతు పనులు, ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేర్లు తదితర నిర్మాణ పనులను ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టి సుమారుగా 45 రోజులలో పూర్తి చేయనున్నామని తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, ఆర్ అండ్ బి విభాగం, నేషనల్ హైవే అథారిటీలు సంయుక్తంగా సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశముల మేరకు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, ఫ్లై ఓవర్ పైన 40 లక్షల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారని కమిషనర్ తెలిపారు. అందుకుగాను ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్ పైన ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించామని వారు స్పష్టం చేశారు. వాహనాల ప్రయాణ మార్గాలను ప్రత్యామ్నాయ దిశలలో మళ్ళించి వాహన చోదకులకు అసౌకర్యం కలగకుండా మార్గాలను నిర్దేశించామని కమిషనర్ వెల్లడించారు.
బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు నుంచి వచ్చే వాహన చోదకులు నూతన పెన్నా వారధి పైనుంచి లేదా సెట్టిగుంట రోడ్డు రైల్వే లైన్ ప్రాంతం నుంచి నగరంలోకి ప్రయాణించాలని, నవాబుపేట, బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు విజయమహల్ గేటు లేదా రామలింగాపురం అండర్ బ్రిడ్జి మార్గాన్ని నగరంలోకి ఎంచుకోవాలని కమిషనర్, ట్రాఫిక్ సి.ఐ లు స్పష్టం చేశారు. కావున నెల్లూరు నగర ప్రజలంతా జరగనున్న అభివృద్ధి పనులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

