మహిళా ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది- సీఎం చంద్రబాబు
ప్రజారోగ్యంపై రూ.20 వేల కోట్లు..
అమరావతి: ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్‌లో వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యం పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్లలో మనదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది.2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి నెంబర్ వన్ గా తయారవుతుంది. వికసిత్ భారత్ కల సాకారంతో పేదరిక నిర్మూలన మనం చూడబోతున్నాం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అలాగే దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేస్తున్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే:- ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి అక్టోబర్ 2 తేదీ వరకూ 15 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తాం:- రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. హైబీపీ, షుగర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, టీబీ తదితర అన్నిరకాల వైద్య పరీక్షలు ఈ కార్యక్రమంలో ఉచితంగా చేస్తాం. గైనకాలజీ, ఈఎన్‌టీ, నేత్ర, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్, పీడియాట్రిషన్ డాక్టర్లు ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందిస్తారు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత:- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ఆరోగ్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.19,264 కోట్ల వ్యయం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ రూ.2.5 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య భీమా కల్పిస్తున్నాం. పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు భరిస్తుంది. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా రూపొందించేందుకు టాటా, గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రాజెక్ట్ సంజీవని చేపట్టాం. విశాఖలోని మెడ్ టెక్ జోన్ ద్వారా వైద్య పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి”. అని సీఎం అన్నారు.