AP&TG

సంక్షేమం అంటే దానం కాదు… సాధికారతకు మార్గం-సీఎం చంద్రబాబు

తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో..

అమరావతి: సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు… వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుందామని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్‌లు, సూపర్ సిక్స్ పథకాల అమలు, డ్వాక్రా, మెప్మా గ్రూపుల పనితీరు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. సంక్షేమం – అభివృద్ధి రంగాలకు సమతూకంగా నిధులు ఖర్చు చేస్తున్నాం. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం.

వైద్యానికి భరోసా:- యూనివర్సల్ హెల్త్ సర్వీసుల కింద రూ.2.5 లక్షల భీమా రాష్ట్రంలో ప్రజలందరికీ వర్తిస్తుంది. జన ఔషధి కింద జనరిక్ మెడిసిన్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల్లో తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి.” అని చంద్రబాబు వెల్లడించారు.

ప్రాంతాల మధ్య పోటీ ఉండాలి… అభివృద్ధి పరుగులు పెట్టాలి:- “అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకెళ్తోంది. ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోంది. ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి. టూరిజం  సర్క్యూట్ల ఏర్పాటు ద్వారా ఆర్ధిక ఎకోసిస్టం ఏర్పాటు అవుతుంది. ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించేలా పాలసీలను తీసుకువచ్చాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రీన్ ట్యాక్స్‌ను కూడా రద్దు చేశాం. సీ-వీడ్ కల్చర్‌ను లాజికల్‌గా తీసుకెళ్తే పెద్దఎత్తున ఆర్ధిక లబ్ది చేరే అవకాశం ఉంటుంది. బయోఫ్యూయెల్ సహా వివిధ రకాలుగా సీ-వీడ్ వినియోగం పెరిగింది. అవసరమైతే దాని కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేద్దాం.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *