ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని ఇస్తాం-మంత్రి పి.నారాయణ
డంపింగ్ యార్డు రహిత రాష్ట్ర సాధనే లక్ష్యం..
అమరావతి: రాష్ట్రంను డంపింగ్ యార్డు రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నామని, పూర్తిస్థాయిలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ సాకారంలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పిలుపునిచ్చారు.
మంత్రి నారాయణ బుధవారం విజయవాడ కేపీ నగర్‌లో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా పార్కు వద్ద రహదారులను శుభ్రంచేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. బహిరంగ ప్రదేశాలను, పబ్లిక్ ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల క్షేమం, సంక్షేమానికి కృషిచేయడం వంటివి చేయడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ రహిత జీవనశైలిని ప్రోత్సహించడంలో భాగంగా తొలి అడుగుగా మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయ బాటిళ్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, శాఖల కార్యాలయాల్లోనూ ఇదేవిధమైన చర్యలు తీసుకొని.. దశల వారీగా ప్రజలను కూడా ఈ మంచి ప్రయత్నానికి చేరువచేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
85 లక్షల టన్నుల చెత్తను వదిలివెళ్లింది:- గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసి 85 లక్షల టన్నుల చెత్తను వదిలివెళ్లిందని.. ఈ చెత్తను ఏడాదిలోగా తొలగించాలని గత అక్టోబర్ 2న గౌరవ ముఖ్యమంత్రి సూచించారని.. ఇప్పటివరకు 83 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించామన్నారు. మరో అయిదు రోజుల్లో మిగిలిన చెత్తనూ తొలగిస్తామన్నారు. ఇందుకు కృషిచేసిన స్వచ్ఛ భారత్ కార్పొరేషన్, మునిసిపల్ శాఖ ఇంజనీర్లు, కమిషనర్లు ఇలా ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

