AP&TG

దేశంలో జలరవాణాకు ల్యాండ్ మార్క్ గా ఏపీని తీర్చిదిద్దుతాం-మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

రోడ్డు, రైల్ రవాణా కంటే 9 రెట్టు తక్కువ ఖర్చు..

అమరావతి: దేశంలోనే అతిపెద్ద సముద్రతీర ప్రాంతం, అత్యంత జలసంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా మన రాష్ట్రం ఉందని, జలరవాణాకు ల్యాండ్ మార్క్ గా మన రాష్ట్రాన్ని తీర్చిదద్దుతామని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖామంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. ఏపీ ఇన్ లాండ్ వాటర్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో వాటాదారులు, భాగస్వామ్య పక్షాల కన్సల్టేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రోడ్డు, రైల్ మార్గాల్లో కార్గో సేవలకంటే జల రవాణాకు అయ్యే ఖర్చు 9 రెట్లు తక్కువన్నారు. త్వరలో బకింగ్ హామ్ కెనాల్ ద్వారా చెన్నైకు జలమార్గంలో సరుకు రవాణాకు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రస్తుతం  మన రాష్ట్రంలో లోతట్టు జలమార్గాల ద్వారా సంవత్సరానికి 8 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుందని, ఇది 16మిలియన్ టన్నుల ఎగుమతి లక్ష్యంగా ఈ ఏడాది ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కృష్ణా–గోదావరి కాలువ వ్యవస్థ (జాతీయ జలమార్గం–4) & పెన్నా నది (NW–79) వంటి వ్యూహాత్మక విస్తరణలు చేయనున్నామన్నారు. ఇప్పటికే  కీలక పారిశ్రామిక కేంద్రాలైన కాకినాడ, కృష్ణపట్నం మరియు మచిలీపట్నం వంటి ప్రధాన ఓడరేవులను అనుసంధానిస్తున్నామన్నారు. బందర్ కెనాల్ (ముక్త్యాల నుండి మచిలీపట్నం) మరియు కృష్ణ నది RO (రోల్ ఆఫ్)- RO (రోల్ ఆన్) కార్గో కారిడార్లు వంటి ప్రాజెక్టులు మనం భారీ వస్తువులను తరలించే రవాణా విధానాన్ని మర్చనున్నాయన్నారు. రాష్ట్రంలోని నదీ కారిడార్ల వెంబడి 50 కి పైగా పారిశ్రామిక క్లస్టర్‌లను కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇది కేవలం రవాణా గురించి మాత్రమే కాదు – ఇది పరిశ్రమను వికేంద్రీకరించడం, కొత్త వృద్ధి కేంద్రాలను సృష్టించడం-నీటి ఆధారిత లాజిస్టిక్స్‌ కు సామీప్యత ద్వారా పెట్టుబడిదారులకు ఖర్చు ప్రయోజనాలను అందించడం కోసమే చేస్తున్నామని మంత్రి వివరించారు.

 ఏపీ ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ జెడ్.శివప్రసాద్ మాట్లాడుతూ జలరవాణాలో మన రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. రాబోయే మూడేళ్ల (2026-29) లో గోదావరి నదిపై గూటాల-వంగలపూడి మధ్య RO-RO సర్వీసులు ఏర్పాటు చేయనున్నామని, విజయవాడ-అమరావతి మధ్య అర్బన్ వాటర్ మెట్రో ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే  ముక్త్యాల – మచిలీపట్నం పోర్టు,  ముక్త్యాల – కాకినాడ పోర్ట్ ల అనుసంధానం చేయనున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ నదీ విహారయాత్రల్లో భాగంగా శ్రీశైలం – నాగార్జునసార్ డ్యామ్ సందర్శన,  పోలవరం – పోచవరం,  శ్రీశైలం – అక్కమహాదేవి గుహాలు సందర్శనకు టెంపుల్ టూరిజం రూట్ లు ఏర్పాటు చేయనున్నామన్నారు. సమావేశంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్, ఆయా సంస్థల ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల నుండి హజరైన స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *