రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం- టీటీడీ చైర్మన్
“శ్రీవారి ముడుపు పత్రం పథకం” ప్రారంభం..
తిరుపతి: టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎం.రవిచంద్రతో కలసి శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యాంశాలు:- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టీటీడీ చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్నవిద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను రూ.118.89 కోట్లు కేటాయింపు.
శ్రీవారి ముడుపు పత్రం పథకం:- భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇందుకు బదులుగా భక్తులు తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో UPI ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు తగిన ముడుపు పత్రాలు అందజేస్తారు. వాటిని నేరుగా శ్రీవారి హుండీలో వేయవచ్చు. తద్వారా భక్తులు నగదు, నాణేలు తీసుకువచ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.
రిలయన్స్ సంస్థ రూ.100 కోట్లు:- తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్న ప్రసాద భవనం, ఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం.
ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు గాను డ్రై ఐల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయం. అందుకుగాను రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం.
అక్షరాభాస్య కార్యక్రమం:- వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభాస్య కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుకు ఆమోదం.
అసత్య కథనాలతో రీల్స్ చేసే వారిపై:- ఇటీవల చాలామంది తమ స్వప్రయోజనాల కోసం తిరుమలలో అసత్య కథనాలతో రీల్స్ చేసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంతో భక్తితో తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతినేలా పోస్టు పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.వీరబ్రహ్మం, డా.ఎ.శరత్, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

