కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే-మంత్రి దుర్గేష్
వైసీపీ చేస్తున్నవి అసత్య ఆరోపణలు..
అమరావతి: కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ చేస్తున్నవి అసత్య ఆరోపణలు అని కొట్టిపారేశారు. మెడికల్ కాలేజీను ప్రభుత్వాలు నిర్వహించడం కన్నా ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిర్వహిస్తే ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుందని, నిర్మాణం పూర్తైన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందన్నారు.దింతో వైద్య విద్య ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వంపై భారం తగ్గుతుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అంతేగాక పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వైసీపీ ఈ వాస్తవాలను పక్కన పెట్టి రూ.8,500 కోట్ల విలువైన కాలేజీలను రూ.5,000 కోట్లకు బినామీలకు లీజుకు ఇస్తున్నారని వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా సగంలో పెట్టి ఏదో జగన్ రెడ్డి సంపాదించి పెట్టిపోయిన ఆస్తిని అమ్మేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలతో మూలనపడ్డ కాలేజ్ లను మళ్లీ పిపిపి విధానంలో పట్టాలు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. సుదీర్ఘ కసరత్తు చేసి కేబినెట్ లో సమగ్రంగా చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పు దోవ పట్టించడం సరైన విధానం కాదని హెచ్చరించారు.