AP&TG

రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి-మంత్రి నాదెండ్ల మనోహర్

కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ…

తిరుపతి: రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా,ఎలాంటి అవరోధాలు లేకుండా జరగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని వి సి హాల్ లో మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, రైతులు పండించిన ప్రతి గింజకు న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని, బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర (MSP) కింద చెల్లింపులు సమయానికి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తగిన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, గన్నీ సంచులు, తాగునీటి సౌకర్యం, నీడ వసతి, రైతులకు కూర్చునే ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. రైతులు ఎక్కువసేపు వేచి ఉండకుండా టోకెన్ విధానం ద్వారా సమయపాలనతో సేవలు అందించాలని తెలిపారు.

మధ్యవర్తుల జోక్యం లేకుండా:- ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా రైతుల నుండి సేకరణ జరగాలని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్‌లైన్, గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఖరీఫ్-రబీ సీజన్లలో అంచనా ఉత్పత్తి, కొనుగోలు లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతి, మిగిలిన లక్ష్యాలపై సమీక్షించారు. ప్రతి జిల్లాలో రోజువారీగా  ప్రగతి నివేదికలు సమర్పించాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ సోరబ్ గౌర్, పౌరసరఫరాల సంస్థ ఎం.డి.డిల్లీ రావు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టర్ లు ఆర్.గోవిందరావు, ఎం.వెంకటేశ్వరులు, ఎ.రాజేంద్రన్ లు,తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సివిల్ సప్లై అధికారులు, మేనేజర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, మిల్లర్లు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *