బనకచర్లపై తెలంగాణ అనుమానాలు నివృత్తి చేయాలి – మంత్రులకు చంద్రబాబు ఆదేశం
కేబినెట్ సమావేశం..
అమరావతి: పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో మాట్లాడుతూ పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన దీనిపై తెలంగాణకు ఎటువంటి నష్టమూ లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా మనం అభ్యంతరం చెప్పలేదని అన్నారు. పోలవరం – బనకచర్లపై నేతలంతా మాట్లాడాలని సీఎం సూచించారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.
కేంద్రం జోక్యం కూడా అవసరం:- పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అవసరమైతే కేంద్రం జోక్యం కూడా అవసరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విషయం అర్ధమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం కోరదామని అన్నారు. సున్నితమైన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని సీఎం దిశ నిర్ధేశం చేసారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు ను ఇంత పెద్దమొత్తంలో కొనుగోలు చేయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని చంద్రబాబు వెల్లడించారు.
మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్:- వాణిజ్య పంటలని కొనుగోలు చేసింది కూడా మన రాష్ట్రమేనని సీఎం ప్రస్తావించారు. ప్రజలకు ఈ విషయం మాత్రం చెప్పుకోలేక పోతున్నామని తెలిపారు. అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. టెంపుల్ టూరిజంతో పాటు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్‌పై సీఎం ప్రసంసించారు. ఈ తరహా కార్యక్రమాలు పెద్డఎత్తున నిర్వహిస్తూ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

