తుపాను ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ చేపట్టాలి-ఉప ముఖ్యమంత్రి
అమరావతి: ‘మొంథా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుపాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలి. తుపాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలన్నారు. తుపాను ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్య ప్రకారం బాగు చేయాలన్నారు. మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

