ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కాలుష్య నియంత్రణకు..
అమరావతి: పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, నివారణకు అనుసరించాల్సిన ప్రణాళికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్న క్రమంలో అక్కడి పరిస్థితులపై తక్షణం అధ్యయనం చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమస్య ఉన్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. అందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసే 100 రోజుల ప్రణాళికను తక్షణం అమలు చేయాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు తీసుకోబోయే చర్యలు ఒక మోడల్ గా దేశం మొత్తం పాటించే విధంగా ఉండాలన్నారు. శనివారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో తీర ప్రాంత కాలుష్యం, పారిశ్రామిక వ్యర్దాల నిర్వహణపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.