AP&TG

కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్ర ప్ర‌భుత్వం-అపారన‌ష్టం,మీరే అదుకోవాలి

మొంథా తుపాను న‌ష్టం రూ.6384 కోట్లు..

అమ‌రావ‌తి:  మొంథా తుపాను రాష్ట్రంలో అంచ‌నాల‌కు మించి అపార న‌ష్టం క‌లిగించింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఉదార‌త చూపి ఆదుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వ‌ల్ల రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు త‌క్ష‌ణ సాయం చేసి ఆద‌కోవాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. మొంథా తుపాన్ వ‌ల్ల వాటిల్లిన  న‌ష్టం మ‌దింపు వేయ‌డానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వ‌చ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ పాసుమీబ‌సు, కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది స‌భ్యుల‌తో కూడిన  కేంద్ర బృందం  సోమ‌వారం ముందుగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చింది. ఈ బృందానికి  స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం  మొంథా తుపాను క‌లిగించిన న‌ష్టం గురించి  రెవెన్యూ శాఖ చీఫ్ క‌మిష‌న‌ర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ జి.జ‌య‌ల‌క్ష్మీ , ఆర్టీజీఎస్ సీఈఓ

ప్ర‌ఖ‌ర్ జైన్‌లు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు.

1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో:- మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించింద‌ని తెలిపారు. అంచ‌నాల‌కు మించిన అపార న‌ష్టం క‌లిగించింద‌ని జ‌య‌ల‌క్ష్మీ చెప్పారు. వ్య‌వ‌సాయ‌రంగానికి మొంథా తుపాను తీవ్ర న‌ష్టం క‌లిగించింద‌న్నారు. కోత ద‌శ‌కు వ‌చ్చిన పంట‌ల‌ను తుపాను ముంచెత్తింద‌ని దానివ‌ల్ల రైతుల‌కు జీవ‌నాధార‌మైన పంట‌లు నీట మునిగిపోయి కోలుకోలేని దెబ్బ‌తీసింద‌న్నారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి, ప‌త్తి, మినుము, మొక్క‌జొన్నపంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. అలాగే  6,250 హెక్టార్ల‌లో ఉద్యాన‌వ‌న పంట‌లు , 17.72 హెక్టార్ల‌లో మ‌ల్బ‌రీ తోట‌లకూ న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. కోలుకోవ‌డానికి కేంద్ర ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. తుపానుకు స‌ర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులు మ‌ళ్లీ కోలుకోవ‌డానికి కేంద్రం అందించే స‌హాయం, స‌హ‌కారం ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు.

680 డ్రోన్లు ఉప‌యోగించాం:- రాష్ట్ర ప్ర‌భుత్వం తుపాను ఎదుర్కోవ‌డానికి ఎంతో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా నివారించ‌గ‌లిగామ‌ని అధికారులు వివ‌రించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కూడా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌ని తెలిపారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల అనుభ‌వంతో ఈ సారి వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 680 డ్రోన్లు ఉప‌యోగించామ‌ని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *