సోషల్ మీడియా నేరాలు పోలీసుశాఖకు ఓ సవాలు- సీఎం చంద్రబాబు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం..
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై విశ్వాసంతోనే గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వాటిని సంరక్షించటంలో పోలీసు శాఖ కీలకపాత్ర పోషించాలని సూచించారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు.
ఈగల్-శక్తి బృందాలతో:- ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజంను అణిచి వేయడంలో ఏపీ పోలీసులు ఎంతో పేరు తెచ్చుకున్నారు. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. సిద్దాంతం పేరుతో, ఆధిపత్యం కోసం, డబ్బుల కోసం నేరాలు చేసే వారు ఉన్నారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడాలి. నేరాల తీరు మారుతోంది. క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారు. వారి ఆట కట్టించాలంటే పోలీసు శాఖ కూడా అప్డేట్ అయి ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నాం. సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేకవుట్… ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతీ 50 మీటర్లకి ఒక సీసీ కెమేరా ఏర్పాటు చేస్తున్నాం. ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది.
రాజకీయ ముసుగు వేసుకుని వస్తున్నారు:- “సమాజంలో అశాంతి సృష్టించి…లబ్ది పొందడం కోసం రాజకీయ ముసుగులో కొత్త నేరగాళ్లు తయారయ్యారు . వీళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదం. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సమాజంలో అశాంతిని సృష్టించడానికి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో పోలీసులు మరింత అలెర్ట్ గా ఉండాలి. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేశారు. దీనికి రాజకీయాన్ని జోడించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సీసీ కెమెరాలతో వాస్తవాలు బయట పెట్టగలిగాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

