అమెరికాలో సిలికాన్ వ్యాలీ-అమరావతిలో క్వాంటం వ్యాలీ-సీ.ఎం చంద్రబాబు
2026 జనవరి 1 నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్..
అమరావతి:: అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. IBM,,TCS,,L&T భాగస్వామ్యంతో ఈ క్వాంటం వ్యాలీ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అమరావతి క్యాంటం వ్యాలీపై ఏర్పాటు చేసిన నేషనల్ వర్క్ షాప్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విజయవాడలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్‌కు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వివరించారు. క్వాంటం కంప్యూటింగ్‌ను భారత్ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. అమరావతికి రావాలని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.
2026 జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ
నేషనల్ క్వాంటం మిషన్‌ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. “క్వాంటం వ్యాలీ పార్క్ కు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి, వందకు పైగా యూజ్ కేసెస్ ను పరీక్షిస్తాం. ఓ మిషన్ తీసుకువచ్చి అమరావతికి క్వాంటం కంప్యూటర్ వచ్చేసింది అనుకోవటం లేదు. వివిధ ఉపకరణాల నుంచి రియల్-టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టి తేమ వంటి అంశాలను పర్యవేక్షించడానికి క్వాంటం కంప్యూటింగ్ అవసరం. క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐలు ఇప్పుడు సరికొత్త సాంకేతిక విప్లవం. ఈ రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయి.
ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎరో స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15 నుంచి వందశాతం పౌరసేవలు వాట్సప్ ద్వారానే అందిస్తాం. డేటా లేక్‌పై ఏపీ ప్రస్తుతం పనిచేస్తోంది. పౌరుల నివాసాలు జియో ట్యాగింగ్, సర్వీస్ డెలివరీ, ఆన్ లైన్ పైల్స్, క్లౌడ్ డేటాలను పాలనలో వినియోగిస్తున్నాం. సీసీ కెమెరాలు, సెన్సార్లు, వేరబుల్స్ ద్వారా రియల్ టైమ్ డేటా వస్తోంది. వీటిని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటింగ్ అవసరం. వ్యవసాయ రంగంలో భూమిలో తేమ, ఎరువుల వినియోగం లాంటి అంశాలను కూడా క్వాంటం కంప్యూటింగ్ తో అనుసంధానిస్తే అద్భుతాలు చేయొచ్చు. క్వాంటం టెక్నాలజీలో స్టార్టప్‌లు కూడా వస్తే అవకాశాలు విస్తృతం అవుతాయి. ఫార్మా రంగంలోనూ, వ్యక్తుల ఔషధ వినియోగం వంటి వాటిపై కూడా పరిశోధనలు సాగించవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను మరో స్థాయికి చేరుస్తుంది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్‌ను ఐబీఎం నేషనల్ వర్క్ షాప్‌లో ప్రదర్శించింది. నేషనల్ వర్క్ షాప్‌లో భాగంగా ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ స్టార్టప్‌లను మంత్రి లోకేష్‌తో కలిసి సీఎం పరిశీలించారు.