సంక్రాంతి పండుగ సందర్భంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎపీఎస్ ఆర్టీసీ పేర్కొంది. గ్రామాలు, మండలాలు, పట్టణాల మధ్య రద్దీ గణనీయంగా పెరిగిన దృష్ట్యా వీటి మధ్య 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు 2,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పండగ ముందు రోజుల్లో మొత్తం 3857 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వీటిలో హైదరాబాద్ కు 240, బెంగళూరు 102, చెన్నైకు 15 బస్సులు ఏర్పాటు చేయగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 3500 ప్రత్యేక బస్సులు సిద్దం చేశారు.

