AP&TG

రాష్ట్రంలో భారీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సన్నాహాలు?-డీజీపీ ప్రతిపాదన

అమరావతి: రాష్టంలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది.? రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గత నెల 29న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌కు ఆయన ఒక లేఖ రాశారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

సిబ్బంది సరిపోవడం లేదు:- రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరిగిపోవడం, సోషల్ మీడియా ద్వారా కొందరు అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తుండటం పోలీసులకు సవాలుగా మారుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో సిబ్బంది కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని, వెంటనే నియామకాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సివిల్ విభాగంలో:- పోలీసు శాఖలోని సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్), ఏపీఎస్పీ, కమ్యూనికేషన్స్ వంటి వివిధ విభాగాల్లో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ తన నివేదికలో తెలిపారు. వీటిలో సివిల్ విభాగంలో 315 ఎస్సై పోస్టులు, 3,580 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే 96 ఆర్‌ఎస్‌ఐ, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులు కూడా భర్తీ కావాల్సి ఉంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో నియామకాలు పూర్తికాలేదు:- 2022 నవంబరులో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా, నియామకాలు పూర్తికాలేదు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవలే ఆ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసింది. ఇప్పుడు డీజీపీ ప్రతిపాదించిన 11 వేలకు పైగా పోస్టులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది నిరుద్యోగ యువతకు, పోలీసు శాఖ పటిష్ఠతకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *