AP&TG

ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర-డిప్యూటీ డైరెక్టర్ పవన్ 

అమరావతి:  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయని, అటు వంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యునికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్య పర్చడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహాకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అద్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా-సోషల్ మీడియా ప్రతినిధులతో జరిగిన చర్చా కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పి పవన్ మాట్లాడుతూ ప్రజా స్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ECI)  చేపట్టిన 23 నూతన కార్యక్రమాలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బందికి  కల్పిస్తున్న సదుపాయాలు,  ప్రక్రియాత్మక సంస్కర్ణలు, చట్టపరమైన చర్యలు, ఇ.సి.ఐ. నూతన ఆవిష్కరణలు మరియు వనరులను  వివరించారు.ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు (SSR) కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఓటర్ సమాచార స్లిప్‌లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, ఓటర్ సీరియల్ నంబర్ మరియు పార్ట్ నంబర్‌ను స్పష్టంగా చూపించనున్నామన్నారు. మరణాల నమోదుకు సంబంధించిన డేటాను RGI డేటాబేస్ నుండి సేకరించి, ధృవీకరణ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు చేయడం జరుగుతుందన్నారు. ఒక్క పోలింగ్ కేంద్రానికి గరిష్ఠంగా 1200 ఓటర్లకే అనుమతి నిస్తున్నామని,  ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని, అపార్టుమెంట్లు/కాలనీల్లో అదనపు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *