జిల్లాలు పునర్విభజనపై సుధీర్ఘ కసరత్తు-31న తుది నోటిఫికేషన్
గూడూరు నెల్లూరులో.. రైల్వే కోడూరు,తిరుపతిలో.. ?
అమరావతి: రాష్ట్రంలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తూ, సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమావేశంలో 927 అభ్యంతరాలు, సూచనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకే గూడూరును కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు మండలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 31న తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను నవంబరు 27వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నెల రోజుల పాటు అభ్యంతారాలను స్వీకరించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేటను, కడపలో కలిపి, రాయచోటిని మదనపల్లిలో,, రైల్వే కోడూరు తిరుపతిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం చర్చింది. ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలతో 29 వరకు జిల్లాల సంఖ్య పెరగాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది.
రైల్వే కోడూరును:- దొనకొండ, కురిచేడును మార్కాపురం జిల్లాలో, పొదిలిని ఒంగోలు జిల్లాలో,, రైల్వే కోడూరును తిరుపతిలో కలిపే అంశంపై కసరత్తు చేశారు. ఆదివారం మరోసారి సమావేశమై సోమవారం మంత్రివర్గ ఉపసంఘం ముందుకు ప్రతిపాదనలు తీసుకురానున్నది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈనెల 31వ తేదీన తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. సమీక్షా సమావేశంకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత, నారాయణ హాజరయ్యారు.

