కోర్టు తలుపులు తట్టే ప్రతి వ్యక్తికి న్యాయం లభించాలి-సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ సూర్యకాంత్
తిరుపతి: న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ లతో కలసి 16 కోర్టు భవనాల నూతన కోర్టు సముదాయ భూమి పూజ-శిలాఫలకాన్ని ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
న్యాయం పొందిన ఆనందంతో వెళ్లాలి:- ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టు సముదాయాలు ఆసుపత్రుల్లా పనిచేయాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాని, ఆసుపత్రికి వెళ్లిన రోగికి మొదట ప్రాథమిక చికిత్స అందించినట్లే, కోర్టుకు వచ్చే ప్రతి వ్యక్తికి కూడా భద్రత, న్యాయం లభిస్తుందనే నమ్మకం కలగాలన్నారు. ఈ బాధ్యత బార్-బెంచ్ రెండింటి పై సమానంగా ఉంటుందన్నారు. ఈ కొత్త న్యాయస్థాన సముదాయం కూడా “న్యాయ దేవాలయం”గా మారాలని నేను కోరుకుంటున్నానని, ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి న్యాయం పొందిన ఆనందంతో వెళ్లాలన్నారు. తిరుపతి బార్ కు ఉన్న మేధస్సు, చారిత్రాత్మక వారసత్వం, మేధో సంపత్తి తో మరింత వికసించాలని ఆకాంక్షించారు.
జస్టిస్ జె.కె.మహేశ్వరి మాట్లాడుతూ తిరుమల కొండ కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ధర్మానికి ప్రతీకని, న్యాయ సంప్రదాయంలో కోర్టును “న్యాయ దేవాలయం”గా పేర్కొంటామన్నారు. తిరుపతికి సమీపంలో సుమారు 14.49 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా కోర్టు నూతన న్యాయ సముదాయం నిర్మితమవుతోందని, మొత్తం 2,40,904 చదరపు అడుగుల నిర్మాణంలో కేవలం 9% మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగించబడగా, 57% భవిష్యత్ విస్తరణకు కేటాయించబడిందని, 16.6% పార్కింగ్ సదుపాయాల కోసం కేటాయించబడిందని, ఈ నిర్మాణ శైలి తిరుపతి గోపురం స్ఫూర్తితో రూపొందించబడిందని, న్యాయ శాఖ-సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 16 కోర్టు హాళ్లు, మెడికల్ రూమ్, వంటి సౌకర్యాలు, భవనం గ్రౌండ్ ఫ్లోర్-ఐదు అంతస్తులతో నిర్మించబడనుందని, దేశంలో మొదటిసారిగా కోర్టు సముదాయంలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల రాకపోకలను సులభతరం చేశారని, కేంద్ర ప్రాంగణం చుట్టూ కోర్టు హాళ్లు ఏర్పాటు చేయడం ద్వారా సహజ కాంతి, గాలి ప్రసరణకు ప్రాధాన్యత ఇచ్చారని, ఐదవ అంతస్తులో గ్రంథాలయం, ఆడిటోరియం, సమావేశ మందిరాలు ఏర్పాటు కానున్నాయని వీడియో ద్వారా సభలో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి, భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జిల్లా యంత్రాంగం, న్యాయవాదులు తదితరులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రినిసిపల్ జడ్జి శ్రీమతి అరుణ సారిక ధన్యవాదాలు తెలిపారు.

