ఆయేషా మీరా హాత్య కేసులో న్యాయం జరగడం లేదు-శంషాద్ బేగం
అమరావతి: ఆయేషా మీరా(బీ ఫార్మసీ విద్యార్థిని) తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు అందచేశారు. అనుమానిత నిందితుడు సత్యంబాబుపై నమోదైన పలు సెక్షన్లపై వారి అభిప్రాయం తెలపాలంటూ సీబీఐ అధికారులు నోటీసుల్లో కోరారు. సీబీఐ అందచేసిన నోటీసులను తిరస్కరించినట్లు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషలు మీడియాకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జూన్‌లోనే దర్యాప్తు ముగిసిందంటూ సీబీఐ అధికారులు సీల్డ్ కవర్‌లో కోర్టుకు నివేదిక సమర్పించారన్నారు. ఒక సారి దర్యాప్తు ముగిసిన తర్వాత మళ్లీ నోటీసులు ఇవ్వడమేంటంటూ ప్రశ్నించారు. దర్యాప్తు రిపోర్టులో ఏముందో తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దర్యాప్తు వివరాల కాపీని తమకు వెంటనే అందజేసిన తరువాత తమ అభిప్రాయం తెలియచేస్తామన్నారు. తాము ఏపీ ప్రభుత్వం ద్వారా సీబీఐని ఆశ్రయించామని, ఈ కేసులో ఏపీ ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని గుర్తు చేశారు. సీబీఐ ద్వారా కూడా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెంటనే స్పందించాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోరారు.