భారతీయ ధర్మం, సంస్కృతి,స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతాయి-పవన్ కళ్యాణ్
అమరావతి: స్త్రీ శక్తి అసమాన్యమైనది. అనుకుంటే సూర్యుడిని సైతం మింగేయగలిగేంత అమోఘమైన శక్తి. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ధర్మం మహిళలకు ఇచ్చే స్థానం అత్యున్నతమైనది. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శ్రీమతి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన నవల తెలుగు అనువాద రూపం ‘ఆమె సూర్యుడిని కబళించింది’. తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ ఎ.కృష్ణారావు అనువదించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “పుస్తక పఠనం మానసిక బలాన్ని పెంచుతుంది. విశాలమైన, విస్తృతమైన ఆలోచనలను పెంపొందిస్తుంది.
నేను లెఫ్టిస్టూ కాదు.. రైటిస్టూ కాదు:- నన్ను చాలా మంది లెఫ్ట్ భావాలు వదిలేసిన వ్యక్తిగా ప్రస్తావిస్తారు. నేనెప్పుడూ లెఫ్టిస్టు కాదు… రైటిస్టూ కాదు.. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. ఆలోచిస్తాను. వామపక్షవాదులు రాసిన పుస్తకాలు చదవడంతోపాటు, వారితో పరిచయాలు ఉన్నాయి. అలాగే జాతీయవాద భావాలు ఉన్న పుస్తకాలు కూడా నేను చదువుతాను. భారతీయ సంస్కృతి ధర్మం గురించి తెలుసుకుంటాను. దేశ భక్తి విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. బయటకు వెళ్లినప్పుడు కూడా విభిన్న రకాల పుస్తకాలను వెతుకుతాను. ప్రతి పుస్తకం విలువైనదే. దేశభక్తి మనకు పుట్టుకతోనే రావాలని కోరుకుంటాను అని అన్నారు.