AP&TGPOLITICS

తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు-చంద్రబాబు పాలనంతా అన్యాయం-వైయస్‌ జగన్‌

అమరావతి: ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి, ఇప్పుడు లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్ధమవుతుందని, ఈ కాలంలో ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు.  వైసీపీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల లీగల్‌సెల్‌ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ..

స్వరం వినిపిస్తే తట్టుకోవడం లేదు:- తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడమే అన్నారు.

ఏ తప్పు చేయకపోయినా కూడా బరద జల్లుతున్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వాటికి అసలు అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్‌ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం.

విచ్చలవిడిగా అవినీతి:- రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి. అది మామూలుగా లేదు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాప్‌లు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్ముతున్నారు. అందుకోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. అలా బెల్టు షాపులు అప్పగిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజాలు. ఎక్కడా చూసినా చట్ట విరుద్ధంగా పర్మిట్‌ రూమ్‌లు. అక్కడ మద్యం బాటిళ్లు కాకుండా, పెగ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్నారు. అదీ చట్ట విరుద్ధమే. అది కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువే.

ఇసుక ఫ్రీ అన్నారు..? కానీ ఎవరికీ ఇవ్వడం లేదు. అంతా దోపిడి. గతంలో మన ప్రభుత్వంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాయల్టీగా వచ్చేది. ఇప్పుడు అది రాకపోగా, ఇసుక ధర రెట్టింపు అయింది. ఏ నియోజకవర్గం తీసుకున్నా కళ్ల ముందే పేకాటలు. క్లబ్‌లు. వాటన్నింటినీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఇది కూడా కళ్ల ముందే కనిపిస్తున్న నిజం.

అమరావతి నిర్మాణంలో యథేచ్ఛ దోపిడి:- అమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. చదరపు అడుగు రూ.4 వేలు లేదా రూ.4500కు బ్రహ్మాండంగా కట్టొచ్చు. లగ్జరీగా ఎక్కడైనా, హైదరాబాద్, బెంగళూరులో కట్టొచ్చు.కానీ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణాన్ని రూ.9500, రూ.10 వేలకు ఇచ్చారు.10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చి, 8 శాతం తీసుకుంటున్నారు. ఇది కూడా కళ్లముందే కనిపిస్తున్న నిజం అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *